లోకేష్‌ షైనింగ్ టీచర్‌కు ఘన సత్కారం

Lokesh honours teacher, vows to strengthen govt schools; focuses on quality education, seeks practical suggestions for improvement.

ఉపాధ్యాయులపై ప్రభుత్వ విద్య బలోపేతం కోసం పవిత్ర బాధ్యత ఉందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని మారుమూల గిరిజన గ్రామం జేఎం తండా పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన ఉపాధ్యాయురాలు ఎం. కల్యాణి కుమారిని ‘షైనింగ్ టీచర్’గా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఆమె నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

కల్యాణి కుమారి 2017లో జేఎం తండా పాఠశాలకు బదిలీ అయి, కేవలం 14 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల రికార్డును మార్చారు. అంకితభావంతో ఇంటింటికీ తిరిగి విద్యార్ధులను ప్రోత్సహించి, 2020-21లో విద్యార్థుల సంఖ్యను 53కి పెంచారు. పేద విద్యార్థులకు అవసరమైన పాఠ్యసామగ్రి అందిస్తూ, ప్రగతిని నిరంతరం పర్యవేక్షించారు. ఇలా సింగిల్ టీచర్‌గా పనిచేస్తూ పెద్దసంఖ్యలో అడ్మిషన్లు సాధించడం చరిత్ర అని మంత్రి ప్రశంసించారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి విద్యార్థిగా మారి ఉపాధ్యాయురాలిని ప్రశ్నిస్తూ, స్కూళ్ల అభివృద్ధి కోసం ఆమె నుంచి విలువైన సూచనలు స్వీకరించారు. విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన విధానాన్ని అభినందించారు. స్టార్ ఆఫ్ ది వీక్, దీర్ఘాయుష్మాన్ భవ లాంటి చొరవలతో విద్యార్థుల్లో ఆసక్తి పెంచిన తీరు ప్రశంసనీయమని తెలిపారు.

ఇకపై ఉత్తమ ఉపాధ్యాయులను కలిసే కార్యక్రమం కొనసాగిస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం, మెగా పీటీఎంలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచే విధంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి సారించారని మంత్రి తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share