మూడో ప్రపంచయుద్ధం పరిస్థితులు ఏర్పడేలా కొన్ని దేశాలు వేగంగా కదులుతున్నాయి. ముఖ్యంగా చైనా, తన సైనిక శక్తిని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా బీజింగ్‌లో రహస్యంగా నిర్మిస్తున్న ఒక సైనిక నగరం చర్చనీయాంశంగా మారింది. ఇది అమెరికా పెంటగాన్ కంటే పది రెట్లు పెద్దదిగా ఉండబోతుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
డ్రాగన్ కంట్రీని అడ్డుకునే ప్రయత్నాలను వ్యర్థం చేయడానికి తన సైనిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని చైనా నిర్ణయించినట్టు సమాచారం. అందులో భాగంగానే రహస్యంగా ఈ భారీ మిలిటరీ సిటీ నిర్మాణం జరుగుతున్నట్టు జాతీయ, అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ నగరాన్ని ప్రపంచం నుంచి దాచడానికి గట్టిగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు విశ్లేషకులు అంటున్నారు.
అమెరికా, జపాన్, ఇండియా వంటి దేశాలతో ఘర్షణలు పెరుగుతున్న తరుణంలో చైనా ఇలా రహస్య సైనిక నగరం నిర్మించడం వెనుక ప్రధాన ఉద్దేశం తన సైనిక వనరులను వేగంగా తరలించడానికి, అధునాతన యుద్ధ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి కావచ్చని భావిస్తున్నారు. ఇది భవిష్యత్తులో యుద్ధం జరిగితే ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచే అవకాశమున్నదని విశ్లేషణలు చెబుతున్నాయి.
ఇక ఇప్పటికే పెంటగాన్ కూడా చైనా చర్యలపై లోతుగా విశ్లేషణ చేస్తోందని సమాచారం. చైనా ఈ రహస్య నగర నిర్మాణం ద్వారా తన సామ్రాజ్యవాద లక్ష్యాలను మరింత బలపరచాలని చూస్తోందని పలు అంతర్జాతీయ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. దీని వల్ల ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయాలు మరింత ఉద్రిక్తతకు లోనయ్యే అవకాశముంది.









