చిత్తూరు జిల్లా కుప్పంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీ4 విధానంపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. పేదరికం తొలగించేందుకు ప్రభుత్వం పీ4 పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, దానికి కించపరిచేలా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. “పేదల కోసం పనిచేసే మార్గదర్శకులు వెతుకుతుంటే, చిల్లిగవ్వ ఖర్చు పెట్టని వారు దాన్ని అడ్డుకుంటున్నారు,” అని సీఎం తీవ్రంగా విమర్శించారు.
గతంలో ‘జన్మభూమి’ ద్వారా పేదలకు సాయం చేసిన విధానాన్ని ఇప్పుడు పీ4 రూపంలో మరింత సమర్థంగా కొనసాగిస్తున్నట్టు సీఎం తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో తిమ్మరాజుపల్లికి చెందిన ఓ కుటుంబం పీ4 ద్వారా పేదలను ఆదుకోవడానికి ముందుకు వచ్చినట్టు గుర్తుచేశారు. “ఈ కుటుంబం చూపిన స్పూర్తి అందరికి ఆదర్శం కావాలి,” అని సీఎం తెలిపారు. పీ4తో పేదలకు మేలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎలాంటి విమర్శలతోనూ ఆగేది లేదని స్పష్టం చేశారు.
బనకచర్ల ప్రాజెక్టుపై కూడా సీఎం స్పందించారు. గోదావరి జలాల వినియోగంలో రెండు రాష్ట్రాలకూ లాభం ఉంటుందని, ఇక్కడ ఎవరికీ నష్టం జరగదని అన్నారు. “గతంలోనే గోదావరిలో పలు ప్రాజెక్టులకు నేనే శంకుస్థాపన చేశాను. సముద్రంలో పోయే నీటిని ఉపయోగిస్తే రెండు రాష్ట్రాలూ లాభపడతాయి,” అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ కట్టిన ప్రాజెక్టుల్ని కూడా వ్యతిరేకించలేదని తెలిపారు.
మామిడి రైతుల సమస్యలపై సీఎం మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం పూర్తి స్థాయి సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో సమస్యలు ఎదురైనా, మామిడి పంటకు విలువ కల్పించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. “డ్రిప్ ఇరిగేషన్‌కు మేమే నిధులు కేటాయించాం, పండ్ల సాగుకు ప్రోత్సాహం ఇచ్చాం. అన్నదాతకు మేమే తోడుంటాం,” అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను దారితప్పించేందుకు కొందరు శరవేగంగా యత్నిస్తున్నారని, ప్రజలు వారిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.









