ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలను ఉపయోగించే కోట్లాది ప్రయాణికులకు కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ‘మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025’ పేరుతో విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం, పీక్ అవర్స్‌లో బేస్ ఫేర్‌పై 2 రెట్లు వరకు సర్జ్ చార్జీలను వసూలు చేయడానికి అగ్రిగేటర్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు ఇది 1.5 రెట్లు మాత్రమే ఉండేది. రద్దీ లేని సమయాల్లో కనీస ఛార్జీ 50% కంటే తక్కువగా వసూలు చేయరాదని స్పష్టం చేసింది.
ఇంకా కనీస బేస్ ఫేర్ కనీసం 3 కిలోమీటర్ల దూరం వరకు కవర్ చేయాలని నిబంధనలో పేర్కొన్నారు. రైడ్ అంగీకరించిన తర్వాత సరైన కారణం లేకుండా డ్రైవర్లు రద్దు చేస్తే లేదా బుక్ చేసిన ప్రయాణికులు రద్దు చేస్తే, ఇద్దరికీ జరిమానా విధిస్తామని కేంద్రం తెలిపింది. ఈ పైనాల్టీ మొత్తం ఛార్జీలో 10 శాతం లేదా గరిష్ఠంగా రూ.100 వరకు ఉండనుంది.
డ్రైవర్లకు మేలు చేసే విధంగా కొత్త మార్గదర్శకాలలో provisions ఉన్నాయి. సొంత వాహనం నడిపే డ్రైవర్లకు మొత్తం ఛార్జీలో కనీసం 80 శాతం వాటా ఇవ్వాలని, కంపెనీకి చెందిన వాహనాలను నడిపే డ్రైవర్లకు కనీసం 60 శాతం వాటా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇది డ్రైవర్ల ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుందని అంచనా.
అత్యంత ముఖ్యంగా, బైక్ ట్యాక్సీలకు చట్టబద్ధత లభించడం ఇదే తొలిసారి. ప్రైవేట్ రిజిస్ట్రేషన్ కలిగిన ద్విచక్ర వాహనాలను ప్రయాణికుల రవాణాకు ఉపయోగించేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. ర్యాపిడో, ఊబర్ మోటో వంటి సంస్థలకు ఇది పెద్ద ఊరట. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలను మూడు నెలల్లో అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కేబ్, బైక్ ట్యాక్సీ పరిశ్రమలు స్వాగతించాయి.









