కాకినాడ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుని స్థానికంగా కలకలం సృష్టించింది. చెల్లితో ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో నులకతట్టు కృష్ణప్రసాద్ అనే యువకుడు, కిరణ్ కార్తీక్ అనే మరో యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని ఖననం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పి. వేమవరం గ్రామంలో ఆందోళనకు కారణమైంది. కృష్ణప్రసాద్ కుటుంబంతో హైదరాబాద్‌లో ఉంటూ ఇరవై రోజుల క్రితం మాత్రమే తన ఊరికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో కార్తీక్ తన చెల్లితో ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడడం గమనించి, వారిద్దరి మధ్య సంబంధం ఉందని అనుమానపడ్డాడు.
ఈ అనుమానం నేపథ్యంలో కృష్ణప్రసాద్ కిరణ్ కార్తీక్‌ను మందలించడం మొదలుపెట్టాడు. ఇటీవల వీరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. గడచిన నెల 24న కృష్ణప్రసాద్, తన స్నేహితుడు దూళ్లపల్లి వినోద్‌తో కలిసి కిరణ్ కార్తీక్‌ను పార్టీ ఇస్తామని చెప్పి బ్రహ్మానందపురం జగనన్న లేఔట్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ కార్తీక్ తలను నేలకేసి కొట్టి, గొంతునులిమి హత్య చేసి, మృతదేహాన్ని అక్కడే గుంత త్రాలి పూడ్చేశాడు. ఈ క్రూర చర్య తర్వాత కృష్ణప్రసాద్ రెండు రోజుల తర్వాత హైదరాబాద్‌కి వెళ్లిపోయాడు.
కిరణ్ కార్తీక్ కనిపించకుండా పోయిన నేపథ్యంలో అతని తండ్రి వీరవెంకట రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తన కుమారుడు కూలీలకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడని మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, కార్తీక్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. క్రమంగా నిజం బయటపడుతుందన్న భయంతో నిందితుడు కృష్ణప్రసాద్ తన స్నేహితుడు వినోద్‌తో కలిసి సామర్లకోట వీఆర్ఓ వద్దకు వెళ్లి హత్య చేసిన విషయం అంగీకరించి లొంగిపోయాడు.
వీఆర్ఓ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చారు. తహశీల్దార్ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మృతదేహాన్ని త్రవ్వి వెలికి తీశారు. హత్య జరిగి పది రోజులు కావడంతో శవం బాగా కుళ్లిపోయి ఉంది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కార్తీక్ తల్లిదండ్రులకు అప్పగించారు. వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, తమ కుమారుడి హత్యకు కారణమైన వారికి కఠినమైన శిక్ష విధించాలని కోరారు.









