పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుని స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. ఇంటి నుంచి తప్పించుకున్న 11 నెలల పెంపుడు సింహం రద్దీ వీధిలోకి వచ్చి మహిళ, ఆమె పిల్లలపై దాడి చేసింది. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుటేజ్‌లో సింహం మహిళను వెంబడించి, ఆమెపై దూకి కింద పడేసి, పిల్లలపై పంజాలతో కొడుతూ కనిపిస్తోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సింహం సొంత ఇంటి గోడ దూకి బయటకు వచ్చి వీధిలోని మహిళను లక్ష్యంగా చేసుకుంది. షాపింగ్ చేసుకుని తిరిగి వస్తున్న ఆమెను సింహం ముంచెత్తి కిందపడేసింది. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న ఐదు, ఏడేళ్ల పిల్లలు కూడా సింహం దాడికి గురయ్యారు. వీరికి ముఖం, చేతులపై తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతానికి వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటన చూసి యజమానులు కూడా బయటకు వచ్చి సింహం దాడిని చూశారంటూ, బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ప్రకారం యజమానులు దాడిని చూస్తూ మౌనంగా ఉండి, అనంతరం సింహాన్ని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. సింహాన్ని పట్టుకుని యజమానులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
దీంతో పోలీసులు 12 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, సింహాన్ని స్వాధీనం చేసుకుని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రావిన్స్‌లో సింహం వంటి వన్యప్రాణులను పెంచడం హోదాకు ప్రతీకగా మారింది. గతేడాది డిసెంబర్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చి, లైసెన్స్ లేకుండా, నివాస ప్రాంతాల్లో వన్యప్రాణులు ఉంచడాన్ని నిషేధించింది.









