ప్రసవ వేదనలో ఏనుగుకు రైలు నిలిపిన మానవత్వం

In Jharkhand, a train was halted for two hours to let a pregnant elephant safely give birth—an inspiring act of compassion and coexistence.

ఝార్ఖండ్‌లో ఒక అరుదైన ఘటన మానవత్వాన్ని ప్రతిబింబించేట్టుగా సాగింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణీ ఏనుగు రైల్వే ట్రాక్‌పైకి రావడంతో, అప్పట్లో ఆ దారిలో వస్తున్న రైలును తక్షణమే నిలిపివేశారు. ఇది జరిగిందీ రెండు గంటల పాటు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్ స్వయంగా పంచుకోవడం విశేషం.

ఆ ఏనుగు ప్రసవ వేధనలతో తీవ్రంగా బాధపడుతూ ట్రాక్‌పైకి వచ్చింది. అటుగా వచ్చిన రైలును గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ సమాచారంతో లోకో పైలట్ రైలు ఆపివేశాడు. సుమారు రెండు గంటల పాటు రైలు అదే స్థలంలో నిలిపి ఉంచారు. చివరకు ఆ ఏనుగు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా అడవిలోకి వెళ్లిన తరువాతే రైలును మళ్లీ నడిపించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను భూపేందర్ యాదవ్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేస్తూ స్పందించారు. జంతువులు మరియు మనుషుల మధ్య దాడులు, ఘర్షణలు ఎక్కువవుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయని పేర్కొన్నారు. ఇది సహజ జీవన సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని ప్రశంసించారు.

ఈ ఉదంతంలో ముఖ్యంగా సహకరించిన స్థానికులు, లోకో పైలట్, మరియు జార్ఖండ్ అటవీ శాఖ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మానవత్వం మిగిలే ఉన్నదన్న ఆశను ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ నొక్కి చెబుతూనే ఉంటాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share