ఇంటర్నెట్లో సమాచారాన్ని వెతికే పద్ధతిని పూర్తిగా మార్చేసే దిశగా గూగుల్ ఒక కీలక ముందడుగు వేసింది. తన సెర్చ్ ఇంజిన్‌లో ‘ఏఐ మోడ్’ అనే కొత్త ఫీచర్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది శక్తివంతమైన జెమిని 2.5 మోడల్‌పై పని చేస్తుంది. ఇంగ్లిష్ భాషా వినియోగదారులందరికీ ఇది వర్తించనుంది. సెర్చ్ ల్యాబ్స్‌లో ప్రత్యేకంగా సైన్ అప్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇది అందుబాటులో ఉంటుంది.
ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా పరిమిత యూజర్లకే లభించిన ఈ ఫీచర్‌కు మంచి స్పందన రావడంతో, గూగుల్ ఇప్పుడు దీనిని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. భారత వినియోగదారుల కోసం గూగుల్ యాప్ సెర్చ్ బార్లో ఈ ఫీచర్ త్వరలో ప్రత్యక్షమవుతుంది. సంప్రదాయ సెర్చ్‌తో పోలిస్తే, ఇది సమాచారాన్ని సమగ్రంగా అందించే విధానాన్ని కలిగి ఉంటుంది.
ఏఐ మోడ్ వినియోగదారుల ప్రశ్నలను సహజ భాషలో గ్రహించి, స్పష్టమైన, సంక్షిప్త సమాధానాలను ఒకేచోట అందిస్తుంది. ఉదాహరణకు, “ఇంట్లో పిల్లలతో ఆడుకోవడానికి ఏం చేయాలి?” లాంటి ప్రశ్నలకు వివరణాత్మకమైన జవాబులు ఇస్తుంది. అంతేకాదు, ఒక్క ప్రశ్న అడిగిన తర్వాత దానికి సంబంధించిన మరిన్ని ప్రశ్నలు కొనసాగింపుగా అడిగే అవకాశం కూడా కల్పిస్తుంది.
ఇంకా, వాయిస్ కమాండ్స్ ద్వారా ప్రశ్నలు అడగొచ్చు. గూగుల్ లెన్స్ సపోర్ట్‌తో ఫోటోలు తీసి వాటి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా సంభాషణాత్మకంగా, సమర్థవంతంగా ఉండే సెర్చ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ మార్పుతో యూజర్లకు సమాచారం సేకరించడం తేలికగా మారుతుంది. గూగుల్ సెర్చ్ ఇప్పుడు కేవలం వెబ్సైట్ల లింకులు ఇవ్వడం కాకుండా, ఏఐ ఆధారిత తక్కువ సమయంలో కరెక్ట్ సమాధానాల్ని అందించే నూతన మాదిరిగా మారుతోంది.









