ఆఫ్ఘన్‌లో బాలికను అమ్మిన తండ్రి దారుణం

Outrage erupts as Afghan father sells 6-year-old daughter to a 45-year-old man; Taliban’s response raises further concerns.

ఆఫ్ఘనిస్థాన్‌లో మానవత్వాన్ని తలదించుకునే దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని మర్జా జిల్లాలో ఓ తండ్రి తన ఆరేళ్ల కుమార్తెను డబ్బుకోసం 45 ఏళ్ల వ్యక్తికి అమ్మి పెళ్లి జరిపించాడు. ఈ అమానవీయ ఘటన వెలుగులోకి రావడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు చెలరేగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఇది పెద్ద చర్చనీయాంశమైంది.

వివరాల ప్రకారం, తీవ్ర పేదరికంలో జీవిస్తున్న ఆ కుటుంబానికి ఒక వ్యక్తి డబ్బు ఇవ్వగా, తండ్రి తన చిన్నారిని అతనికి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. అమెరికాకు చెందిన మీడియా సంస్థ అము.టీవీ ఈ విషయాన్ని వెల్లడించగా, పెళ్లికి సంబంధించిన ఫోటోలు వెలుగు చూసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఫోటోలో చిన్నారి పక్కన కూర్చున్న మధ్య వయస్సు వరుడిని చూసి నెటిజన్లు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన తాలిబన్ అధికారులు బాలికను తన భర్త ఇంటికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది. అయితే వారు, “బాలికకు తొమ్మిదేళ్లు నిండాక భర్త ఇంటికి పంపొచ్చు” అనే అభిప్రాయం వ్యక్తం చేయడం కల్లోలానికి దారితీసింది. తాలిబన్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో బాలిక తండ్రిని, వరుడిని అరెస్ట్ చేశామని హష్త్-ఎ-సుభ్ డైలీ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం బాలిక తల్లిదండ్రుల వద్ద సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన 2021 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పేదరికం, విద్యపై ఆంక్షలు, స్త్రీలకు స్వేచ్ఛా హక్కుల లేమి ఇవన్నీ దీనికి కారణాలుగా మారాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, తాలిబన్ల పాలనలో బాల్య వివాహాలు 25% పెరిగాయని పేర్కొంది. మానవ హక్కుల సంస్థలు ఈ పరిస్థితిపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ, బాలికల రక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share