తెలంగాణలో కర్ణాటక తరహాలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య పవర్ షేరింగ్ జరగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరూ ఒకే టీమ్‌గా పని చేస్తున్నామని, నాయకత్వానికి ఎలాంటి విభజన అవసరం లేదని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇటీవల కాంగ్రెస్ పీఏసీ సమావేశం సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు హద్దులు మీరుతున్నాయని భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ప్రజల మధ్యకి వెళ్లకుండా దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. రుణమాఫీపై మాట్లాడుతున్న వారి ముందు నిజాలను ఉంచుతూ, రూ. 2 లక్షల కన్నా ఎక్కువ రుణాలు మాఫీ చేయవద్దన్నది ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ జరిగిందని చెప్పారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తోందని భట్టి తెలిపారు. ప్రజలకు నేరుగా ప్రయోజనం కలిగే విధంగా పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే సన్న బియ్యం పంపిణీ వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతోందని, గతంలో జరిగినట్లు ఇందులో ఎలాంటి దుర్వినియోగం జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై కూడా భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ పనులు శరవేగంగా సాగుతున్నాయని, మూసీ నదీ సుందరీకరణ పనులు ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతాయని హామీ ఇచ్చారు. గాంధీ ఘాట్ వరకు అభివృద్ధి పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. బీజేపీ ప్రచారం చేస్తున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తెలంగాణలోకి వచ్చే అవకాశమే లేదని ఆయన స్పష్టంగా తేల్చేశారు.









