పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ విడుదలకు సిద్ధమవుతోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యి, యూ/ఏ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం 2 గంటల 42 నిమిషాల నిడివితో జులై 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు జులై 20న విశాఖపట్నంలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ వేడుకకు పవన్ కల్యాణ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. అభిమానుల్లో ఉత్సాహం పెంచేలా ఈ ఈవెంట్లో ఒక పవర్ఫుల్ సాంగ్‌తో పాటు సినిమా మేకింగ్ వీడియోను కూడా విడుదల చేయనున్నారు. మూడేళ్ల విరామం తర్వాత పవన్ కల్యాణ్ బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతుండటంతో ఆయన అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.
చిత్రానికి తొలినాళ్లలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, తర్వాతి భాగాన్ని ఏఎం జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. చారిత్రక నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా సినిమా భావోద్వేగాలూ, యుద్ధ సన్నివేశాలూ సమపాళ్లలో ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడమే కాకుండా, విజువల్ గ్రాండియర్‌కి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథనంగా, విజువల్ ప్రెజెంటేషన్‌గా ఎంతో బలంగా తయారైన ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించటం మరో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.









