తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ల అంశంపై ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గతంలో అధికారంలో ఉన్న ప్రతిపక్ష నేతలు ఇప్పుడు గోదావరి నీళ్లు అడ్డుకోవడం వాస్తవానికి వ్యతిరేకమన్నారు. “మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ నీళ్లు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మేము తెస్తే అడ్డుకుంటామంటారా?” అంటూ ప్రశ్నించారు.
రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని, వారి ఆకలి తీరే ఆయుధం అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ నేతలు రేషన్ కార్డుల పంపిణీ గురించి పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తుండగా, రేషన్ దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారని చెప్పారు.
వ్యవసాయాన్ని దండుగా కాకుండా పండుగలా మలచే విధంగా పాలన కొనసాగుతోందని రేవంత్ పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం దేశంలో వరి ఉత్పత్తిలో గుర్తింపు పొందేలా మారుతోందని చెప్పారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఎలా చూడాలో చెప్పే ఉదాహరణగా పేర్కొన్నారు.
తుంగతుర్తికి నీళ్లు తీసుకురావడానికి అధికారంలోకి వచ్చిన మూడో రోజే ప్రయత్నం చేస్తామన్న మాటలు బీఆర్ఎస్ నేతలే అన్నారని గుర్తు చేశారు. కానీ పదేళ్లు అధికారంలో ఉన్నా దేవాదుల నుంచి నీళ్లు తేలేకపోయారని ఘాటు విమర్శలు చేశారు. తాము పాలనలో ఉన్నప్పుడు మాట ఇచ్చినట్లే నీళ్లను ప్రజల వద్దకు తీసుకువస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.









