వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాం కేవలం రూ. 3,200 కోట్ల వరకు పరిమితం కాలేదని, దీని వల్ల 30 వేల మంది తమ ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఈ స్కామ్‌ను దేశ సరిహద్దులు దాటే స్థాయికి తీసుకెళ్లారన్నారు. ఇలాంటి ఘనత సాధించిన వారికి స్వర్ణ పతకాలు ఇవ్వాల్సిందని ఆయన ఎద్దేవా చేశారు.
సోమిరెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీ లిక్కర్ స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్నట్టే, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన భారీ లిక్కర్ స్కామ్‌పై కూడా అదే స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ స్కాంలో ఎంతో మంది ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని, దీని వెనుక ఉన్న నెట్‌వర్క్ అంతటినీ వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత ఈడీకి ఉందన్నారు.
ఒక వ్యక్తి సోషల్ మీడియాలో రూ. 50 కోట్లు పెట్టి కుక్క పిల్ల కొన్నానంటూ ఫేక్ పోస్ట్ పెట్టితే… నిజమా కాదా అన్నదికూడా తెలుసుకోకుండానే ఈడీ స్పందించిందని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. అలాంటి తక్షణ స్పందన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విషయంలోనూ ఉండాలని, దీనిపై నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ స్కామ్ వల్ల ప్రజల ఆరోగ్యానికి జరిగిన నష్టాన్ని ఎవరు భరించాలనన్నారు.
ప్రధాని మోదీ పహల్గామ్ ఉగ్రవాదులపై తీసుకున్న చర్యల్ని గుర్తు చేస్తూ, ఆర్థిక ఉగ్రవాదులపై కూడా అటువంటి గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరు ఈ అంశంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఈడీ, కేంద్ర సంస్థలు నిజాయితీతో స్పందిస్తే మాత్రమే బాధ్యులెవరో బయటపడతారని చెప్పారు.









