ఒవైసీ కళాశాలపై దుష్ప్రచారం ఆపాలని హెచ్చరిక

HYDRA Chief Ranganath clears stance on Owaisi colleges, says all institutions are equal and urges an end to targeted misinformation.

ఒవైసీ కళాశాలల విషయంలో పదేపదే హైడ్రాను ప్రశ్నించడాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రంగా తప్పుబట్టారు. తమకు ఏ కళాశాల అయినా ఒకటేనని, సామాజిక కోణంలో పని చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో బతుకమ్మకుంట వద్ద హైడ్రా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, స్థానికులతో కలిసి నీటి వనరుల పరిరక్షణపై హైడ్రా ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ, హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, మూసీకి సంబంధం లేకపోయినా హైడ్రాను అందులోకి లాగడం తగదన్నారు. ఒవైసీ కళాశాలల విషయంలో హైడ్రా తన నిర్ణయాన్ని అప్పుడే వెల్లడించిందని చెప్పారు. 2015-16లో నిర్మించిన కళాశాలపై, 2016లో మాత్రమే ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశామని వివరించారు. ఇది చట్టబద్ధమైన ప్రక్రియలో భాగమని స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ 80 శాతం చెరువులకు తుది నోటిఫికేషన్ జారీ కాలేదని, 540 చెరువులకు కేవలం ప్రాథమిక నోటిఫికేషన్లు మాత్రమే ఉన్నాయని రంగనాథ్ పేర్కొన్నారు. సల్కం చెరువు విషయంలో కూడా తుది నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఈ సమయంలో అనధికారిక ఆరోపణలు చేయడం సరికాదని, తాము అనధికారిక నిర్మాణాలను తప్పక తొలగిస్తామని హెచ్చరించారు.

ఒవైసీ కళాశాలపైనే ఎందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు. హైడ్రా ఏ వర్గం విద్యాసంస్థ అయినా సమానంగా చూస్తుందని, రాజకీయ అవసరాల కోసం హైడ్రాపై బురద చల్లడం తగదన్నారు. పేదలను ముందుకు తీసుకెళ్లి పెద్దల అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలు తమ ఆస్తులను ఆక్రమణదారుల నుంచి కాపాడుకోవాలని సూచించారు. బతుకమ్మకుంటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా బతుకమ్మ సంబరాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share