కోలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని మిగిల్చుతూ ప్రముఖ దర్శకుడు, నటుడు వేలు ప్రభాకరన్ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ఆయన మృతి వార్త సినీ వర్గాల్లో విషాదాన్ని రేకెత్తించింది.
వేలు ప్రభాకరన్ 1980లో “ఇవర్గళ్ విత్యసామానవర్గళ్” అనే చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం దర్శకుడిగా మారి “నాలయ మనిదన్” వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ఆయన సినిమాల్లో సామాజిక అంశాలను సున్నితంగా, సాహసంగా చర్చించేవారు. దర్శకుడిగానే కాదు, నటుడిగా కూడా పలు సినిమాల్లో తనదైన ముద్ర వేసిన వేలు ప్రభాకరన్, ఆఖరిసారిగా 2023లో వచ్చిన “గజన” అనే చిత్రంలో కనిపించారు.
వేలు ప్రభాకరన్ వ్యక్తిగత జీవితంలో కూడా వార్తల్లో నిలిచారు. ఆయన 2017లో “కదల్ కాదై” సినిమాలో తనతో కలిసి నటించిన నటి షిర్లే దాస్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు దర్శకనటి జయాదేవి మొదటి భార్యగా ఉన్నారు. వివాదాస్పద విషయాలను తెరపై ప్రదర్శించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండేది.
వేలు ప్రభాకరన్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ధైర్యవంతమైన చిత్రాలు, విభిన్నమైన దృక్కోణాలు, వినూత్న కథనాలు కోలీవుడ్‌కు వెలకట్టలేని కోనుగోలు. ఆయన లేని లోటు కొలువుతీరదని అభిమానులు భావిస్తున్నారు.









