ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్, తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని అక్రమంగా బయటపెట్టారన్న ఆరోపణలపై యూట్యూబర్ జాన్ ప్రోసర్, మైకెల్ రామాచియొట్టి అనే టెక్ వ్యక్తులపై ఫెడరల్ కోర్టులో న్యాయపరమైన చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారం ఇప్పుడు టెక్ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆపిల్ ఫిర్యాదు ప్రకారం, రామాచియొట్టి అనే వ్యక్తి ఆపిల్ ఉద్యోగి ఇథన్ లిప్నిక్ ఇంట్లో ఉండగా, అతని వద్ద ఉన్న డెవలప్మెంట్ ఐఫోన్లో ఐఓఎస్ 26 సాఫ్ట్‌వేర్‌ను యూట్యూబర్ జాన్ ప్రోసర్కు ఫేస్‌టైమ్ ద్వారా చూపించాడు. ఈ సన్నివేశాన్ని ప్రోసర్ వీడియో రూపంలో తన యూట్యూబ్ ఛానెల్లో పొందుపరిచి, ఆపిల్ రహస్య ఫీచర్లను బహిర్గతం చేశాడు.
ప్రోసర్ వీడియోలలో ఐఓఎస్ 26లో ఉండబోయే కొత్త కెమెరా యాప్ డిజైన్, మెసేజెస్ అప్డేట్లు, లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ వంటివి వెల్లడించడం వల్ల ఆపిల్ ప్రణాళికలు దెబ్బతిన్నాయని సంస్థ వాదిస్తోంది. ఈ సమాచారం పోటీదారులకు ముందుగానే లభించడంవల్ల, మార్కెటింగ్ వ్యూహాలు బలహీనపడ్డాయని పేర్కొంది. ఉత్పత్తులపై వినియోగదారుల ఆసక్తి కూడా తగ్గిందని ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో, ఆపిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. తాము బహిర్గతం చేయకూడని సమాచారాన్ని తమ అనుమతి లేకుండా బయటపెట్టినందుకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేసు వేసింది. రహస్య డేటా పరిరక్షణకు చట్టపరమైన చర్యల ద్వారా దుష్ప్రభావాలను ఎదుర్కొనడమే లక్ష్యంగా కంపెనీ ఈ దూకుడు చర్యలు తీసుకుంది.









