టాలీవుడ్‌కు తనదైన హాస్యంతో నవ్వులు పూయించిన నటుడు ఫిష్ వెంకట్ ఇక లేరు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ మీద ఆధారపడ్డ ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించింది. వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని తెలిపారు కానీ, సరైన దాత దొరకకపోవడంతో చివరకు పరిస్థితి విషమించి మృతి చెందారు.
వాస్తవానికి ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేశ్. 1971లో మచిలీపట్నంలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే హైదరాబాద్‌కి వలస వచ్చారు. జీవనోపాధికై ముషీరాబాద్‌లో చేపలు అమ్మే వ్యాపారం చేశారు. ఆ నేపథ్యంలోనే ఆయనకు “ఫిష్ వెంకట్” అనే పేరు స్థిరపడింది. అయినా, సినీ ప్రేమతో సినిమాల వైపు మొగ్గుచూపిన వెంకట్‌కి అదృష్టం శ్రీహరి రూపంలో వచ్చింది. ఆయన సారథ్యంలో దర్శకుడు వీవీ వినాయక్ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
2002లో తారక్ నటించిన ఆది సినిమాలో “ఒక్కసారి తొడకొట్టు చిన్నా” అనే డైలాగ్‌తో ఫిష్ వెంకట్ ప్రేక్షకుల మనసుల్లో స్థిరంగా నిలిచిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లోనూ హాస్యంతో అలరించారు. విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ, కామెడీ నటుడిగానూ 100కి పైగా సినిమాల్లో తనదైన గుర్తింపు పొందారు. ఆయన తెలుగు యాస, హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రత్యేకతగా నిలిచాయి.
చిన్నపాత్రలే అయినా అవి పెద్ద గుర్తింపునిస్తాయని ఫిష్ వెంకట్ తన నటనతో నిరూపించారు. ఆయన మృతితో టాలీవుడ్ ఒక్క గొప్ప నటుడిని మాత్రమే కాదు, ఓ సహజమైన హాస్య కళాకారుడిని కోల్పోయింది. ఆయన మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అభిమానుల మనసుల్లో చిరకాలం గుర్తుండిపోతారు.









