టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫిట్‌నెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. శారీరక శ్రమ ఉంటేనే మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండగలమని స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటికీ ఆడుతున్నా, తన ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణం శారీరకంగా యాక్టివ్‌గా ఉండడమేనని తెలిపాడు.
ఈ సందర్భంగా ధోనీ భారతీయుల ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. “ఈ రోజుల్లో చాలా మంది తమ వయసు కంటే తక్కువగా కనిపించాలని కోరుకుంటున్నారు. దీని వల్ల శారీరక శ్రమ తగ్గిపోయింది. ఫిట్‌నెస్ స్థాయి సగటుగా తగ్గిపోయింది” అని పేర్కొన్నాడు. ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి మారాలని సూచించాడు.
ధోనీ తన కుమార్తె జివా గురించి కూడా మాట్లాడాడు. “ఆమె పెద్దగా శారీరక శ్రమ చేయదు. క్రీడల పట్ల ఆసక్తి తక్కువ. ఇది ఆమె ఒక్కటే కాదు, నేటి పిల్లలందరిలో కనిపిస్తున్న సామాన్య సమస్య” అని అన్నాడు. ఈ తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలతో మమేకం చేయాల్సిన అవసరం ఉందని సూచించాడు.
ప్రతి ఒక్కరు రోజూ కొంతమేరైనా శారీరక శ్రమ చేయాలని, ఫిట్‌గా ఉండటం కోసం జీవితంలో వ్యాయామం, క్రీడలు తప్పనిసరి భాగాలుగా మారాలని ధోనీ పేర్కొన్నాడు. నేటి లైఫ్‌స్టైల్‌లో మానవులు ఎక్కువగా సాంకేతికతపై ఆధారపడుతున్నారని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని హితవు పలికాడు.









