ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో జిల్లాలో ఓ విద్యార్థిని తనను సుదీర్ఘకాలంగా వేధిస్తున్న యువకుడికి నడిరోడ్డుపైనే గుణపాఠం నేర్పింది. గంగాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోనీ రోడ్డులో నీలమ్ స్వీట్ హౌస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని ధైర్యంగా స్పందిస్తూ యువకుడిని చెప్పుతో కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ధైర్యానికి పలువురు ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
విద్యార్థిని తెలిపిన వివరాల ప్రకారం, స్కూల్‌కు వెళ్తున్న సమయంలో, తిరిగి వస్తున్న సమయంలో, ఆ యువకుడు తరచూ ఆమెను ఈవ్ టీజింగ్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. మొదట్లో నిర్లక్ష్యం చేసినప్పటికీ, అతని ప్రవర్తన రోజు రోజుకు దాటికి పోవడంతో, విద్యార్థిని తట్టుకోలేక చివరకు రోడ్డుపైనే ధైర్యంగా అతడిని అడ్డుకుంది. అనంతరం చెప్పుతో అతడిని కొట్టి గుణపాఠం నేర్పింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరుపక్షాలను విచారించారు. యువకుడు బ్యాటరీ రిక్షా కంపెనీలో వాటర్ సప్లై విభాగంలో పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. బాధిత విద్యార్థిని నుంచి ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఈవ్ టీజింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి చర్యలను తీవ్రంగా తీసుకుంటామని తెలిపారు.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. విద్యార్థిని చూపిన ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడే వారికి ఇది గుణపాఠంగా నిలవాలని అంటున్నారు. మరోవైపు, మహిళల భద్రతకు సంబంధించి ఈ సంఘటన పోలీసులకు హెచ్చరికగా మారిందని పౌరసంఘాలు అభిప్రాయపడుతున్నాయి.









