రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించడంతో భారీ స్థాయిలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సీఎంఆర్ (CMR) ధాన్యం దారిమళ్లింపులో రైస్ మిల్లర్లు కోట్లాది రూపాయల మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్, నిర్మల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో జరిగిన ఈ సోదాలు ప్రభుత్వ ధాన్యం రక్షణపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి.
నిర్మల్ జిల్లా కడెం ప్రాంతంలోని కట్టా బాలాజీ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు 2684 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం దారి మళ్లించారని గుర్తించారు. దీని విలువ సుమారు రూ. 6.22 కోట్లుగా అంచనా వేశారు. సంగారెడ్డి జిల్లా డాకూర్‌లోని కన్యకా పరమేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీస్‌పై కూడా తనిఖీలు నిర్వహించగా 3752 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యం తక్కువగా ఉన్నట్లు తేలింది. దాని విలువ రూ. 87 లక్షలకు పైగా ఉండగా, సదరు మిల్లు యజమానిపై చర్యలు ప్రారంభించమని స్థానిక అధికారులకు సిఫార్సు చేశారు.
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని చాముండి, వరాహి రైస్ మిల్లుల్లో కూడా భారీ స్థాయిలో దారి మళ్లింపు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 1,47,375 బస్తాల సీఎంఆర్ ధాన్యం మాయం కాగా, దాని విలువ రూ. 13.67 కోట్లుగా తేలింది. మరోవైపు హైదరాబాద్ రూరల్ యూనిట్ అధికారులు శంషాబాద్ సమీపంలో పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. 15 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని రూ. 5 లక్షల విలువగా అంచనా వేశారు.
అదేవిధంగా హైదరాబాద్ సిటీ-2 యూనిట్ అధికారులు రవాణా మరియు మైనింగ్ శాఖతో కలిసి రాష్ట్ర రహదారులపై తనిఖీలు నిర్వహించారు. అధిక లోడ్‌తో వెళ్తున్న వాహనాలకు రూ. 2.80 లక్షల జరిమానా, రాయల్టీ ఉల్లంఘనకు రూ. 40 వేల జరిమానా విధించారు. సరైన పత్రాలు లేని రూ. 2 లక్షల విలువైన వాటర్ ట్యాంకర్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, ధాన్యం దారిమళ్లింపును గమనించినప్పుడు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 14432కి సమాచారమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









