నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో చిన్న మద్దనూరు గ్రామం వినాయక కాటన్ మిల్లు వద్ద కలెక్టర్ సంతోష్ గురువారం పత్తి కొనుగోళ్ల కేంద్రాన్ని పరిశీలించారు. సీసీఐ కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ, ట్యాబ్ ఎంట్రీ, గేట్ ఎంట్రీ, స్లాట్ బుకింగ్ విధానం, పంట నమోదు వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, రైతుల సమస్యలను తెలుసుకున్నారు.
కలెక్టర్ సీసీఐ అధికారులకు ఆదేశిస్తూ.. “స్లాట్ బుకింగ్ చేసిన రోజు పత్తి కొనుగోళ్లను పూర్తి చేయాలి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలి” అన్నారు. అకాల వర్షాలు, తేమ శాతం ఎక్కువగా ఉండటం వంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని MSP ప్రకారం పంటను కొనుగోలు చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
2025-26 సంవత్సరం పత్తికి కేంద్రం కనీస మద్దతు ధర (MSP) క్వింటాల్‌కు రూ. 8,110/-గా నిర్ణయించింది. పత్తి తేమ శాతం 8-12% మధ్య ఉండాలి; 1% ఎక్కువ తేమ ఉన్న పత్తి ధర 1% తగ్గుతుంది. 12% కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయదు. రైతులు పత్తిని ఇంట్లో బాగా ఆరబెట్టి, సరైన తేమ శాతంతో విక్రయించాలి.
రైతులు “కపాస్ కిసాన్ యాప్” ద్వారా ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి. నిర్ణీత తేదీకి సరైన తేమ శాతంతో పత్తిని తీసుకువస్తే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా MSP పొందగలరు. స్లాట్ బుకింగ్ విధానం వల్ల జిన్నింగ్ మిల్లుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. కలెక్టర్ వెంట తహశీల్దార్ జాకీర్ అలీ, సీసీఐ అధికారి దీపక్, పవన్ వంటి అధికారులు ఉన్నారు.









