ముధోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఒక మహిళ కుటుంబ సమస్యలతో బాధపడుతూ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన గురించి సమాచారం డయల్ 100 ద్వారా ముధోల్ పోలీస్ నారిశక్తి బృందానికి అందింది.
నారిశక్తి బృందం సమయస్ఫూర్తిగా స్పందించి వెంటనే సంఘటన స్థలానికి చేరి, ఆ మహిళను రక్షించారు. ఆత్మహత్య ప్రయత్నాన్ని నిరోధించడం ద్వారా ఆమె ప్రాణాలను కాపాడారు.
రక్షణ అనంతరం మహిళను ముధోల్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ అందించారు. తరువాత ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించి, భద్రతా పరిస్థితులు మరియు సహాయం పొందే మార్గాలను వివరించారు.
ఈ సందర్భంలో ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, మహిళలు ఎలాంటి సమస్యల్లో ఉన్నా తక్షణ సహాయం కోసం డయల్ 100 కు ఫోన్ చేయవచ్చని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల రక్షణకు సిద్ధంగా ఉందని సూచించారు. నారిశక్తి బృందం సమయానికి స్పందించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.









