శుక్రవారం నర్సాపూర్ పట్టణ పర్యటనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కాళేశ్వరం ప్రాజెక్టు మరియు ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ముందుగా బాలల దినోత్సవం సందర్భంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె రెడ్డిపల్లి గ్రామానికి చేరుకుని రైతులతో భూముల సమస్యలపై చర్చించారు.
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విన్న అనంతరం కవిత మాట్లాడుతూ, రెడ్డిపల్లిలో భూముల మార్కెట్ రేటు రెండున్నర కోట్ల వరకు ఉండగా, అదే రేటుకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపరిహారం విషయాన్ని స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలని, రైతులు అన్యాయం అనుభవించకూడదని ఆమె పేర్కొన్నారు. అయిదారు సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల ఈ ప్రాంతం సాగు అవకాశాలు కోల్పోతోందని, ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 90 వేల ఎకరాలకు సాగునీటి లాభం చేకూరుతుందని తెలిపారు.
తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఎవరు గెలిచినా ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదని కవిత వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను గెంటేయడానికి కారణం, తమ పేరు గట్టిగా చెప్పడమే అని ఆమె విమర్శించారు. రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడూ గళమెత్తే జాగృతి, భవిష్యత్తులో కూడా రైతుల పక్షానే నిలబడుతుందని హామీ ఇచ్చారు.
గ్రామ పర్యటనలో భాగంగా ట్రిపుల్ ఆర్ రీజినల్ రింగ్ రోడ్ కారణంగా కోల్పోతున్న గ్రామ చెరువును కూడా కవిత పరిశీలించారు. చెరువును కాపాడే చర్యలు, ప్రజల అభ్యంతరాలు, పరిహారాల అంశాలపై స్థానిక నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.









