మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డులలో 70 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన, గతంలో పదేళ్లపాటు పదవులు భర్తీ చేసిన నాయకులు డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాన్ని సరిగా చేయలేదని, కాగితాల్లో అభివృద్ధి చూపించారని ఆరోపించారు.
వివిధ సమస్యలను గుర్తించి సరి చేయడానికి రెండు సంవత్సరాలు పట్టినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని ఒప్పించి మిర్యాలగూడకు నిధులు మంజూరు చేయించినట్టు వెల్లడించారు. ఈ నిధులతో నగరంలో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు తెలిపారు.
సంవత్సర కాలంలో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి మిర్యాలగూడకు నూతన శోభను తీసుకువస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. అన్ని వార్డులలో డ్రైనేజీ నిర్మాణాలు, సీసీ రోడ్లు, స్మశాన వాటికల నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగేలా కృషి చేస్తున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు బండి యాదగిరి రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, మంత్రాల రుణాల్ రెడ్డి, పుట్టల శ్రీనివాస్, సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే పనులు సమయానికి పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.









