జపాన్‌లో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన క్యూషూ ద్వీపంలోని సకురాజీమా అగ్నిపర్వతం నేడు భారీగా విస్ఫోటనం చెందింది. మధ్యాహ్నం 12:57 గంటల సమయంలో అకస్మాత్తుగా బద్దలైన ఈ అగ్నిపర్వతం ఆకాశాన్ని చీల్చినట్టుగా 4,400 మీటర్ల ఎత్తుకు దుమ్ము, ధూళి, రాళ్లను ఎగరవేసింది. ఇది గత ఏడాదిలో నమోదైన అత్యంత శక్తివంతమైన విస్ఫోటనం అని నిపుణులు వెల్లడిస్తున్నారు. జ్వాలలు, గరగర ధ్వనులు, అంతరాళంలో మెరుస్తున్న అగ్ని తీగలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి.
విస్ఫోటనం అనంతరం కాగాషిమా, మియాజాకి, కుమామోటో ప్రాంతాల్లో మూడోస్థాయి అగ్నిపర్వత హెచ్చరికలు జారీ చేశారు. స్థానికులకు అగ్నిపర్వతం పరిసరాల్లోకి వెళ్లవద్దని, ఇళ్లలోనే ఉండాలని సూచనలు ఇచ్చారు. అగ్నిపర్వతం వద్ద గాలి దిశ మారుతుండటంతో దట్టమైన బూడిద గ్రామాలపై కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ బృందాలు సిద్ధంగా ఉండగా, సమీప ప్రాంతాల్లో స్కూల్స్, ప్రజా రవాణాపై జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
దీంతో కాగాషిమా అంతర్జాతీయ విమానాశ్రయంలో 30కిపైగా విమానాలు రద్దయ్యాయి. రన్‌వేపై, పరిసరాల్లో దుమ్ము పేరుకుపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ అధికారులు సమన్వయం కొనసాగిస్తున్నారు. రైళ్లు, బస్సుల సేవలు కూడా జాగ్రత్త చర్యలతో నెమ్మదించారు. అగ్నిపర్వతం ఆగ్రహం తగ్గే వరకు ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించినా, విస్ఫోటనం శక్తి ప్రజలలో ఆందోళనను పెంచింది. 2019లో ఇదే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు దుమ్ము, రాళ్లు 5.5 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి పడి భారీ ప్రభావం చూపిన విషయం గుర్తుచేసుకున్నారు. జపాన్‌లో దాదాపు 100కిపైగా యాక్టివ్ వోల్కానోలు ఉన్నప్పటికీ సకురాజీమా అత్యంత చురుకైనదిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తదుపరి విస్ఫోటనాలను అంచనా వేసేందుకు నిపుణులు నిరంతరం మానిటరింగ్ కొనసాగిస్తున్నారు.









