దేవరకొండలోని డిండి రోడ్డు మీనాక్షి చౌరస్తా నుండి మైనంపల్లి వాగు బ్రిడ్జి వరకూ 4.4 కిలోమీటర్ల వరకు రోడ్డు పనులు ప్రారంభించి ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయినా, ఇంకా తారు పరచకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. రోడ్డు మొత్తం కంకరగా మిగిలిపోవడంతో ప్రతి రోజు దుమ్ము దుమ్ముగా మారి అక్కడి వాతావరణం పూర్తిగా క్షోభితమవుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం స్కూల్ బస్సులు వెళ్లే సమయాల్లో దుమ్ము అంతకంతకూ పెరిగి ప్రమాదాలకు దారి తీస్తోందని స్థానికులు చెబుతున్నారు.
హనుమాన్ నగర్, అయ్యప్ప నగర్, తాటి కోల్ రోడ్డుకు చేరే ప్రతి ఇంటి పైకప్పులు, కిటికీలు, వస్తువులపై దుమ్ము చేరిపోతుండడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఇంటిని శుభ్రం చేసినా గంటల వ్యవధిలోనే ధూళి మళ్లీ పేరుకుపోతుండడంతో గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం, వృద్ధుల శ్వాస సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు.
రోజూ దేవరకొండ టౌన్‌కు చందంపేట, నేరేడుగోమ్ము, దేవరకొండ మండలాల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, మార్కెట్ అవసరాల కోసం ఈ రూట్‌లో ప్రయాణిస్తున్నా, రోడ్డు మీద ఏర్పడిన గుంతలు, కంకర రాళ్లు వాహనదారులకు పెద్ద ఇబ్బంది కలిగిస్తున్నాయి. చిన్న చిన్న రాళ్లు వెళ్తున్న వాహనాల చక్రాల నుంచి ఎగిరి కళ్లలో పడుతున్నాయని బైక్ రైడర్లు చెబుతున్నారు. వేగంగా నడిపే అవకాశం లేకపోవడంతో ట్రాఫిక్ జాములు కూడా తరచూ ఎదురవుతున్నాయి.
రోడ్డుపై వ్యాపారం చేసే చిన్న చిన్న దుకాణాల యజమానులు, చిరు వ్యాపారులు దుమ్ము ధూళి తమ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తువులపై పడే దుమ్ము, కస్టమర్లు ఆగకపోవడం, రోజువారీ ఆదాయం తగ్గిపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే రోడ్డు పనులను పూర్తి చేసి తారు పరచాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.









