జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మరోసారి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ రాజకీయ వేదికను వేడెక్కించారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రధాన హామీ — 1.5 కోట్ల మహిళలకు స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున బదిలీ చేస్తామని — నెరవేర్చే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని పీకే ప్రశ్నించారు.
ఈ హామీ అమలు అవుతుందని నమ్మకం తనకు లేదని స్పష్టం చేసిన పీకే, కానీ ఎలాంటి సందేహాలు లేకుండా ప్రజల ముందు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. “ప్రభుత్వం నిజంగా ఆ డబ్బులు మహిళల ఖాతాల్లో జమ చేస్తే… నేను వెంటనే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను” అని ఆయన వెల్లడించారు.
ఇంతటితో ఆగని పీకే, “రాజకీయాలు మాత్రమే కాదు… నేను బిహార్ రాష్ట్రాన్నే వదిలి వెళ్తాను. ప్రభుత్వ హామీ నిజమైతే ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను” అని అన్నారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలు మళ్లీ చురుగ్గా మారాయి.
బిహార్‌లో స్త్రీ శక్తి ఓటు బ్యాంక్‌గా కీలక పాత్ర పోషిస్తుండగా, పీకే విసిరిన ఈ సవాల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. హామీ అమలు సాధ్యాసాధ్యాలపై విపక్షాలు ఇప్పటికే ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సవాల్ రాజకీయ చర్చకు కొత్త దారులు తీసుకువచ్చింది.









