ట్రిపుల్ ఆర్ భూ సర్వేపై కవిత ఆగ్రహం

Kavitha alleges irregularities in Triple‑R land acquisition and demands a full re‑survey, questioning government silence on land grabs and injustices.

రంగారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్రిపుల్ ఆర్ భూ సేకరణలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్లను అధికార పార్టీ నేతల ప్రయోజనాల కోసం మార్చారని, సాధారణ రైతుల భూములు అన్యాయంగా తీసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా రీ–సర్వే తప్పనిసరి అని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

“వాషింగ్ పౌడర్ నిర్మా రాజకీయాలు మనకెందుకు?” అంటూ కాంగ్రెస్‌పై కవిత విమర్శలు చేశారు. కబ్జాలు చేసిన వారే ఇప్పుడు పార్టీ మార్పుల పేరుతో ‘క్లీన్’ ఇమేజ్ తెచ్చుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లాలో చెరువులు, ప్రభుత్వ భూములు ఎమ్మెల్యేల చేతిలోనే కబ్జా అవుతున్నా, హైడ్రా విభాగం మాత్రం ఎందుకు నిశ్శబ్దంగా ఉందని ప్రశ్నించారు. కబ్జాల వివరాలన్నీ అధికారులకు అందిస్తామని, చర్యలు తీసుకుంటారా లేక వదిలేస్తారా అన్నది ఇప్పుడు ప్రజలు గమనిస్తారని అన్నారు.

అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లే నేతలపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. “కబ్జాలు చేసిన వాళ్లు కాంగ్రెస్‌లో చేరితే, ఒక్క రాత్రిలోనే ‘నిర్మా వాష్’ అవుతారా?” అంటూ ఆమె మండిపడ్డారు. రైతుల భూములపై జరుగుతున్న అన్యాయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్‌కరీని కూడా కలసి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. సామాన్య ప్రజల కోసం పోరాటం కొనసాగుతుందని, జాగృతి కార్యక్రమాలు ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆగవని చెప్పారు.

రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నా, అసలు లాభాలు స్థానిక ప్రజలకు అందడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. “హైదరాబాద్‌కు కంఠహారంలాంటి జిల్లా అయిన రంగారెడ్డిలో అసలు అభివృద్ధి ఎవరికోసమో జరుగుతోంది. పేదలకు వేరే న్యాయం, పెద్దలకు వేరే న్యాయమా?” అని ఆమె నిలదీశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా జాగృతి ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share