మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా BJP కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు. ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, సామాజిక సమానత్వం కోసం ఫూలే చూపిన మార్గం ప్రతి కార్యకర్తకు ప్రేరణ కావాలని సూచించారు. ఫూలే ఆశయాలను నిజం చేయడం బాధ్యత అని, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం BJP కట్టుబడి ఉందని అన్నారు.
మీడియాతో మాట్లాడుతూ లక్ష్మణ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా BC వర్గాలు అన్యాయానికి గురవుతున్నాయని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కాలం నుంచి ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం వరకు కూడా BCలకు న్యాయం జరగలేదని అన్నారు. ‘‘అధికారంలోకి వస్తే BCని సీఎంగా చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ BJP’’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి BCలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, వారి ఓట్ల కోసం మాత్రమే హామీలు ఇస్తున్నారని ఆరోపించారు.
BCల కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్నీ గాల్లో కలిసిపోయాయని లక్ష్మణ్ విమర్శించారు. 42% రిజర్వేషన్లు, 42% ప్రభుత్వ కాంట్రాక్టులు, BC సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత, ఇవన్నీ చెప్పి చివరకు మాట తప్పారని వ్యాఖ్యానించారు. అశాస్త్రీయ సర్వేలతో ప్రజలను మభ్యపెట్టడం, కోర్టుల్లో అభాసుపాలు కావడం, కోట్లు ఖర్చు చేసి కేసులు కొట్టేయించుకోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణలో తొందరపడి చేసిన BC సర్వేలు కాంగ్రెస్‌కు అక్కడ చెంపపెట్టు తీర్పు తెచ్చాయని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. BCలకు 42% మంత్రి పదవులు ఇవ్వడంలోనైనా, BC సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడంలోనైనా ఎక్కడ కోర్టు అడ్డుపడిందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ హయాంలో BCలకు 34% రిజర్వేషన్ ఉండగా, ఇవాళ 17%కు తగ్గించారని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు BJP నేతలు పాల్గొన్నారు.









