కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న తోడు దొంగలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని వ్యాఖ్యానించారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదని, కేంద్రం పక్క రాష్ట్రాలకు వేల కోట్లు కేటాయిస్తూ తెలంగాణకు మాత్రం గుండు సున్నా మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో కల్వకుర్తి బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్లు కాంగ్రెస్–బీజేపీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు చేసిన హామీలను అమలు చేయకుండా, ప్రజలకే బాకీ పడిన ప్రభుత్వం ఇదేనని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో కళకళలాడిన కల్వకుర్తి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో వెలవెలబోతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలు చేసిందని, దీనివల్ల సామాన్యుల ఆస్తి విలువ నేలమట్టం అయిందని వివరించారు. ఉత్తరాది రైతులపై బీజేపీ చూపుతున్న ప్రేమ, తెలంగాణ రైతులపై లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాల్లోకి వస్తే ప్రజలు వారి వైఫల్యాల గురించి నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఆగమైయ్యే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం అన్యాయం చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిశ్చేష్టంగా చూస్తూ ఉండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ బీఆర్ఎస్ సాధిస్తుందని, గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి దిశగా సాగాలంటే బీఆర్ఎస్కు మద్దతు అవసరమని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ ఒక్కటే బీఆర్ఎస్ అని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పు తెలుపుతారని ఆయన పేర్కొన్నారు.









