అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు రానున్న విషయం ఇప్పటికే దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ భారీ ఈవెంట్ కోసం అధికారులు సిద్ధమైన పనులను వేగవంతం చేశారు. ప్రత్యేకంగా మెస్సీ రాక సందర్భంగా భద్రత, రవాణా, ప్రేక్షకులకు సౌకర్యాల ఏర్పాట్లను ఉన్నత స్థాయిలో చేపడుతున్నారు.
ఈ సందర్బంగా మంగళవారం మెస్సీ గోట్ టూర్ 2025 ప్రమోటర్ల బృందం ఉప్పల్ స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది. ఇండియా చీఫ్ పార్వతి రెడ్డి, చీఫ్ ప్రమోటర్ దత్తా, మెస్సీ అంతర్జాతీయ టూర్ సలహాదారు, వ్యక్తిగత మేనేజర్ క్రిస్టోఫర్ ఫ్లాన్నరీ, పాబ్లో నెగ్రే తదితరులు స్టేడియంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్సీ ధరించబోయే ప్రత్యేక జెర్సీలను కూడా ఆవిష్కరించడం కార్యక్రమానికి మరింత ఆకర్షణను తీసుకుంది.
గోట్ టూర్లో భాగంగా మెస్సీ పాల్గొనే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. ఆర్ఆర్-9 జెర్సీతో బరిలోకి దిగేందుకు సీఎం ఇప్పటికే ఫుట్‌బాల్ ప్రాక్టీస్ కూడా పూర్తి చేశారు. ఫుట్‌బాల్‌పై సీఎంకు ఉన్న అభిరుచి ఈ ఈవెంట్‌కు మరింత ప్రత్యేకతను జతచేస్తోంది.
మెస్సీ భారత పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. డిసెంబర్ 13 ఉదయం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో కార్యక్రమంలో పాల్గొని, అదే రోజు సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. డిసెంబర్ 14న ముంబై వాంఖడే స్టేడియంలో సాయంత్రం 5:30కి కార్యక్రమం ఉండగా, డిసెంబర్ 15న మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద ఆయన పర్యటన ముగియనుంది. ఈ పర్యటన మొత్తం దేశ ఫుట్‌బాల్ అభిమానులకు ఒక చారిత్రాత్మక క్షణంగా నిలవనుంది.









