తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటన పార్లమెంట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. విద్యార్థినిపై లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్, డ్రగ్స్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి అడ్జర్న్‌మెంట్ మోషన్ నోటీసు ఇచ్చారు. లోక్‌సభ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, వర్సిటీలో చోటుచేసుకున్న ఘటనలు అత్యంత హేయమైనవని, విద్యార్థుల భద్రత పూర్తిగా ప్రమాదంలో పడిందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీఈడీ చదువుతున్న దళిత విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడటం రాష్ట్ర ప్రతిష్టకు మచ్చ తెచ్చిందని తెలిపారు.
అధికార వర్గాల్లోని కొంతమంది వ్యక్తులు తమ పదవిని దుర్వినియోగం చేసి విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసిన విషయం మరింత దారుణమని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకొని బెదిరించడం నేరమే కాకుండా మానవత్వానికి వ్యతిరేకమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కోల్పోవడానికి దారితీస్తాయని, గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం అత్యంత విచారకరమని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాను వెనక్కి తగ్గబోనని ప్రకటించారు.
ఇక వర్సిటీ హాస్టళ్లో నిర్వహించిన తనిఖీల్లో 20 గంజాయి ప్యాకెట్లు బయటపడటం క్యాంపస్ భద్రతపై పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిస కావడం అత్యంత ఆందోళనకరమని ఎంపీ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయడం లాంటిదని, వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికలు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు భద్రత లేకపోవడం తీవ్ర ఆందోళనకరమని తెలియజేశారు.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే ప్రకటించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి తిరుపతి ఎస్పీ, ఉన్నతాధికారులతో సమన్వయం కొనసాగుతోంది. పూర్తి స్థాయి విచారణ కోసం ప్రత్యేక పోలీసు బృందం ఒడిశాలో కొనసాగుతున్నదని, త్వరలోనే తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనలు విద్యాసంస్థల్లో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.









