అఖండ-2 రిలీజ్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్

Madras High Court clears Akhanda-2 release after settlement between 14 Reels Plus and Eros International; film likely to release on December 12.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కలయికలో రూపొందిన అఖండ-2 విడుదలకు చివరకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం, మద్రాసు హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్, ఈరోస్ ఇంటర్నేషనల్‌కు బాకీగా ఉన్న రూ.28 కోట్లు చెల్లించకపోవడం వల్ల రిలీజ్‌పై స్టే విధించబడింది. విడుదలను అడ్డుకున్న ఈ ఆర్థిక సమస్యపై రెండు సంస్థల మధ్య జరిగిన చర్చలు కీలక మలుపు తీశాయి.

సోమవారం సాయంత్రం జరిగిన చర్చల అనంతరం ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అఖండ-2 విడుదలకు అంగీకరించింది. దీంతో సినిమా రిలీజ్‌పై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మద్రాసు హైకోర్టు విచారణలో సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు అనుమతితో, చిత్రబృందం వెంటనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇవ్వడానికి సన్నాహాలు ప్రారంభించింది.

ఇటీవ‌ల నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా అఖండ-2 ఇష్యూ క్లియర్ అయినట్లు వెల్లడించారు. డిసెంబర్ 12 విడుదల తేదీగా ఖరారయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆయన చెప్పిన వివరాలు నిజమవుతున్నాయి. సినిమా యూనిట్ కూడా డిసెంబర్ 11న ప్రీమియర్ షోలు, 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు అఖండ-2 కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు. అఖండ మొదటి భాగం సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. విడుదల ఆలస్యంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. అయితే ఇప్పుడు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌తో అఖండ-2కి పూర్తి స్థాయి మార్గం సుగమమైంది. ఇక కొన్ని గంటల్లో చిత్రయూనిట్ అధికారిక రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share