ఓటు చోరీపై ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా

Telangana Congress leaders and cadres joined the AICC-led mega protest in Delhi alleging large-scale vote theft across the country.

ఓటు చోరీ అంశంపై ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీలో నిర్వహించిన మహాధర్నాకు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. నేడు ఒంటి గంటకు ఢిల్లీకి చేరుకునే విధంగా నాయకులు, కార్యకర్తలు ప్రణాళిక చేసుకోవాలని టీపీసీసీ ముందుగానే సూచించింది. టీపీసీసీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి, ఈ నిరసనకు బలమైన మద్దతు సమకూర్చింది. పార్టీ పిలుపును విజయవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు చురుకుగా పాల్గొన్నారు.

ఓటు చోరీ కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు టీపీసీసీ ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని చైర్మన్‌గా నియమించారు. ఆయన నేతృత్వంలో సంతకాల సేకరణతో పాటు ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెలంగాణ నుంచి సేకరించిన దాదాపు పది లక్షలకు పైగా సంతకాల ఫారమ్‌లను ప్రత్యేక వాహనంలో గాంధీభవన్ నుంచి రెండు రోజుల క్రితమే ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు పంపించారు.

ఒకే అడ్రస్‌లో భారీ సంఖ్యలో ఓట్లు నమోదు కావడం, డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అడ్రస్‌లు, ఫామ్-6 దుర్వినియోగం, చెల్లని ఫోటోలతో ఓటర్ల నమోదు వంటి అంశాల ద్వారా ఓటు చోరీ జరుగుతోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా సంతకాల ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది. కర్ణాటకలో ఒక కోటి పన్నెండు లక్షలు, పంజాబ్‌లో ఇరవై ఏడు లక్షల సంతకాలను సేకరించగా, ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగింది. తెలంగాణలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అనేక సమావేశాలు నిర్వహించి ఈ ఉద్యమాన్ని సమన్వయం చేశారు.

సేకరించిన సంతకాలతో రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రాష్ట్రపతిని కలిసి ఓటు చోరీ అంశంపై వినతిపత్రం అందజేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఢిల్లీలో జరుగుతున్న ఈ మహాధర్నాకు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఓటు చోరీ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులను పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share