హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణపై మంత్రి సమీక్ష

Minister Ponguleti Srinivasa Reddy reviewed measures to protect Housing Board lands and resolve lease and legal issues.

హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్‌, సీఈ వెంకట రమణారెడ్డితో పాటు సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్ బోర్డు పరిధిలోని భూముల లీజులు, అగ్రిమెంట్లు, కోర్టు కేసులు, అద్దెలు వంటి అంశాలపై ఈ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు.

నిజాం కాలం నుంచి ఇప్పటివరకు 115 సంస్థలకు హౌసింగ్ బోర్డు భూములను లీజుకు ఇచ్చినట్టు అధికారులు మంత్రికి వివరించారు. ఇందులో ఇన్‌స్టిట్యూషన్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ స్థలాలు, పాఠశాలలు, దేవాలయాలు తదితరాలు ఉన్నాయని తెలిపారు. ఏడు స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు, అద్దె బకాయిలు ఉన్నట్టు వెల్లడించారు. లీజు అగ్రిమెంట్లు పునరుద్ధరించుకోని సంస్థలకు హౌసింగ్ బోర్డు తరఫున నోటీసులు జారీ చేసి రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి షాపు యజమాని ప్రతి ఏడాది 10 శాతం అద్దె పెంచుతూ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఈ నిబంధన అమలు కావడం లేదని అధికారులు తెలిపారు. దీంతో కోట్లాది రూపాయల అద్దె బకాయిలు హౌసింగ్ బోర్డుకు రావాల్సి ఉందని వివరించారు. ప్రస్తుతం షాపులు నిర్వహిస్తున్న వారు వాటిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తే మార్కెట్ ధర ప్రకారం విక్రయించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, లేదంటే వేలం ద్వారా విక్రయించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు.

అలాగే కోర్టు కేసుల్లో ఉన్న భూములు హౌసింగ్ బోర్డుకే చెందేలా పటిష్టంగా వాదనలు వినిపించేందుకు ప్రత్యేక అడ్వకేట్‌ను నియమించాలని ఆదేశించారు. గతంలో హౌసింగ్ బోర్డు కేటాయించిన ఇండ్లకు పక్కనే ఉన్న వంద గజాల లోపు స్థలాలను ఆయా ఇంటి యజమానులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపితే విక్రయించాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని ప్లాట్లకు, అలాగే పక్కనే ఉన్న అదనపు స్థలాలకు సంబంధించి పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ఈ అంశాలన్నింటిపై క్యాబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share