గురుకుల ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి అజారుద్దీన్

Minister Azaruddin orders probe into Gurukul food poisoning, warns officials over negligence.

గురుకులాల్లో ఇటీవల చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన దురదృష్టకరమని మంత్రి మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఈ విషయాలు వెల్లడించారు.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అజారుద్దీన్ తెలిపారు. విద్యార్థులకు భోజనం పెట్టే ముందు కనీసం 30 నిమిషాల ముందే అక్కడి అధికారులు, సిబ్బంది ఆహారం రుచి చూడాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఫుడ్ పాయిజన్ విషయంలో ఇకపై ఎలాంటి అలసత్వం సహించబోమని స్పష్టం చేశారు.

గురుకులాల్లో సిబ్బంది కొరతపై స్పందించిన మంత్రి, మొత్తం పోస్టుల్లో కేవలం 40 ఖాళీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మరోవైపు తెలంగాణలో వక్ఫ్ భూముల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. వక్ఫ్ భూముల రక్షణ కోసం ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు లేఖలు రాసినట్లు వెల్లడించారు.

వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఉమ్మిద్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని, అయితే గత పది రోజులుగా టెక్నికల్ ఎర్రర్ కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయని అజారుద్దీన్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 63,180 ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉండగా, ఇప్పటివరకు 16,700 ఎకరాలు మాత్రమే పోర్టల్‌లో నమోదు చేశామని, మిగిలిన భూముల నమోదు కోసం కేంద్రానికి గడువు పెంచాలని లేఖ రాశామని చెప్పారు. మైనారిటీ బడ్జెట్ పెంపు కోసం కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share