నేరస్థులకు సరిహద్దులు లేనప్పుడు పోలీసులకు కూడా సరిహద్దులు ఉండకూడదనే లక్ష్యంతో హైదరాబాద్ మహానగరంలో జీరో డిలే పోలీసింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఎటువంటి ఆలస్యం లేకుండా పోలీసు సేవలు అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ట్రై పోలీసు కమిషనరేట్(హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) పరిధిలో ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సారధ్యంలో సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం బంజారాహిల్స్ ఐసీసీసీ భవనంలో కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. జీరో డిలే విధానంతో సేఫ్ హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచేందుకు సమన్వయంతో పని చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ సందర్భంగా వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. పరిధుల పేరుతో ప్రజలకు పోలీసు సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టం చేశారు. సమన్వయ లోపం లేకుండా వేగంగా స్పందించాలన్నారు. క్రిమినల్స్‌పై ట్రై కమిషనరేట్ పరిధిలో నిరంతర నిఘా ఉండాలని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సూచించారు. అలాగే మూడు కమిషనరేట్‌లలో నో ఎంట్రీ సమయాలు ఒకే విధంగా ఉండాలని, రద్దీ సమయాల్లో భారీ వాహనాల రాకపోకలను శివారు ప్రాంతాలకు పరిమితం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సీసీటీవీ నెట్‌వర్క్‌లను అనుసంధానం చేయాలని, రియల్ టైంలో నేరస్థుల కదలికలను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు నేరస్థులపై పట్టు సాధించేందుకు జాయింట్ టీమ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. గంజాయి, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, పెండింగ్ చలాన్‌ల వసూలు కోసం మూడు కమిషనరేట్‌లలో ఏకకాలంలో చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అదనపు సీపీలు, జాయింట్ సీపీలు, డీసీపీలు పాల్గొన్నారు.









