టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల డైరెక్టర్ రాజ్ నిడమనూరును రెండో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. వివాహం అనంతరం ఆమె పూర్తిగా తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా 2026 ఏడాదికి సంబంధించిన తన భవిష్యత్ ప్రణాళికలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
భవిష్యత్తులో బయట ప్రపంచపు ఒత్తిడికి లోనవకుండా తన అంతరాత్మను వినాలని, కృతజ్ఞతతో జీవితాన్ని ముందుకు నడిపించాలని నిర్ణయించుకున్నట్టు సమంత తెలిపింది. తొందరపాటు విజయాలకన్నా స్థిరమైన, నాణ్యమైన పనిపై దృష్టి పెట్టి నెమ్మదిగా అయినా బలంగా ఎదగాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.
దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్, శారీరక బలం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్టు పేర్కొంది. అలాగే వ్యక్తిగత జీవితంలో పైపై సంబంధాలకంటే నిజమైన అనుబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, తన చుట్టూ ఉన్నవారితో అర్థవంతమైన సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.
సమాజం తనకు ఇచ్చిన ప్రేమ, గుర్తింపుకు ప్రతిఫలంగా తిరిగి సమాజానికి ఏదో ఒక రూపంలో ఇవ్వాలన్న ఆలోచన కూడా తన ప్రణాళికల్లో భాగమని సమంత వెల్లడించింది. మొత్తం మీద తన జీవిత లక్ష్యానికి అనుగుణంగా అర్థవంతమైన ప్రయాణాన్ని ఎంచుకుంటానని చెప్పగా, ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు సమంతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.









