పాతబస్తీలో గజం ఖాళీ స్థలం కూడా దొరకని పరిస్థితుల్లో, ఏకంగా 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమణదారుల నుంచి హైడ్రా శుక్రవారం భూమిని కాపాడింది. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ గ్రామ పరిధిలోని మొహమ్మద్‌నగర్–లాలితాబాగ్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఈ భూమిని రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో హైడ్రా స్వాధీనం చేసుకుంది.
టౌన్ సర్వే నంబర్ 28, బ్లాక్ ఎఫ్, వార్డు నెంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఇప్పటికే 2 ఎకరాల్లో నివాసాలు ఏర్పడిన నేపథ్యంలో వాటిని తాకకుండా మిగిలిన 7 ఎకరాల భూమిని హైడ్రా రక్షించింది. ఇనుప రేకులతో నిర్మించిన అక్రమ ప్రహరీని తొలగించి, అక్కడ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమిగా స్పష్టంగా సూచించే బోర్డులు ఏర్పాటు చేసింది.
సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం ఈ ప్రాంతంలో చెరువు, నాలా ఉన్నట్టు నిర్ధారణ అయినప్పటికీ, వాటి ఆనవాళ్లు లేకుండా కబ్జాదారులు మట్టితో కప్పేశారు. ఈ భూమిని ఆర్. వెంకటేష్ కుటుంబ సభ్యులు తమదంటూ చెప్పుకుంటూ, ఇతరులతో కలిసి దశాబ్దాలుగా కబ్జాలో ఉంచారు. వీరిపై భవానీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఒక దశలో పట్టాభి రామిరెడ్డి అనే వ్యక్తి భూమి తాను కొన్నానంటూ కోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వ భూమిపై తప్పుడు వాదనలు చేసినందుకు కోర్టు రూ.కోటి జరిమానా కూడా విధించింది. అయినప్పటికీ అక్రమణదారులు ఖాళీ చేయకపోవడం గమనార్హం.
ఈ భూమి విలువ దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైడ్రా చర్యలతో మొహమ్మద్‌నగర్–లాలితాబాగ్ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమంగా ప్లాట్లుగా మార్చి అమ్మే ప్రయత్నాలు నిలిచిపోయాయని, చెరువు, నాలాలను పునరుద్ధరిస్తే బహ్రుక్‌నుద్దౌలా ప్రాంతంలా ఆహ్లాదకర వాతావరణంతో పాటు వరద ముప్పు కూడా తగ్గుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ చర్యలను వారు ప్రత్యేకంగా అభినందించారు.









