హనుమకొండలో వరదలపై మాక్ ఎక్సర్సైజ్

A flood rescue mock drill was conducted in Hanumakonda to demonstrate coordinated relief operations by SDRF and other departments.

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేపట్టాల్సిన సహాయక చర్యలపై అవగాహన కల్పించేందుకు హనుమకొండలోని సమ్మయ్య నగర్, రెడ్డిపురం ప్రాంతాల్లో సోమవారం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. వరదలు సంభవించిన సమయంలో ప్రజలను ఎలా సురక్షితంగా రక్షించాలి, పునరావాస కేంద్రాలకు ఎలా తరలించాలి అనే అంశాలపై రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్), అగ్నిమాపక శాఖ, మున్సిపల్, రెడ్ క్రాస్, ఎన్సీసీ తదితర శాఖలు సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ చేపట్టాయి.

సమ్మయ్య నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖల సిబ్బందికి వరద సహాయక చర్యలపై జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సుదర్శన్ రెడ్డి వివరించారు. ఎమర్జెన్సీ సైరన్ మోగగానే వరదల్లో ఇళ్లలో చిక్కుకున్నట్లుగా చూపించి, తాళ్లు, లైఫ్ జాకెట్లు, స్ట్రెచర్ల సాయంతో కాలనీ ప్రజలను రక్షించే విధానాన్ని ప్రదర్శించారు.

వృద్ధులు, చిన్నారులు, మహిళలు, అనారోగ్యంతో ఉన్న వారిని ప్రత్యేక శ్రద్ధతో బయటకు తీసుకువచ్చి బస్సుల ద్వారా స్నేహ నగర్‌లోని ఎస్వీ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వరదల్లో ఇళ్లపైకి చేరుకున్న ప్రజలకు డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్లు, తాగునీటి సీసాలను అందజేసే విధానాన్ని కూడా ఈ మాక్ ఎక్సర్సైజ్‌లో ప్రదర్శించారు.

ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారి రవి చౌహాన్ ఆధ్వర్యంలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టగా, హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రిటైర్డ్ మేజర్ సుధీర్ బాహల్, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ వీడియో కాల్ ద్వారా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తదితరులు పాల్గొని సహాయక చర్యలను పరిశీలించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share