భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం లడ్డు ప్రసాదంలో బ్రతికున్న పురుగులు ఉన్నాయంటూ కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని దేవస్థానం అధికారులు ఖండించారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఇలాంటి ఫేక్ వార్తలు వ్యాప్తి చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై దేవస్థానం ఈఓ దామోదర్ రావు పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ శుద్ధి, నాణ్యత ప్రమాణాలతో ప్రసాదం తయారు చేస్తామని, లడ్డు నిల్వలు ఎక్కువ కాలం ఉంచే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటప్పుడు ప్రసాదంలో పురుగులు రావడం అసంభవమని తెలిపారు.
దేవస్థానంలో తయారయ్యే ప్రసాదాన్ని ప్రతిరోజూ భక్తులకు పంపిణీ చేస్తున్నామని, నిల్వ ఉండే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని ఈఓ వివరించారు. ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేయడం తీవ్రంగా ఖండనీయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి ఫేక్ ప్రచారాలకు పాల్పడకుండా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను దేవస్థానం అధికారులు కోరారు. భద్రాచలం ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని, భక్తులు కూడా ఇలాంటి అసత్య వార్తలను నమ్మవద్దని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.









