రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని, వాటిని సమర్థంగా ఉపయోగించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం తెలిపారు. పర్యాటకుల భద్రతకు 100 శాతం భరోసా ఇవ్వాలని, అన్ని ప్రాంతాల్లో ఏ విధమైన భద్రతా సమస్యలు రాకూడదని ఆయన స్పష్టం చేశారు. పర్యాటకులు సంతోషంగా తిరిగి వెళ్లాలని, రాష్ట్రం సురక్షితం అని భావన కలిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు ఆయన తెలిపారు.
సమన్వయ సమావేశంలో పర్యాటక, దేవాదాయ, రోడ్లు మరియు భవనాల శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేశ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొని పర్యాటక అభివృద్ధి, ఉపాధి కల్పనలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ టూరిజం హాట్ స్పాట్లను గుర్తించడం, సౌకర్యాలు మెరుగుపరచడం, హెలీపోర్టులు ఏర్పాటు చేయడం వంటి సూచనలు చేశారు.
పర్యాటకులు భద్రతతో పాటు పర్యావరణ అవగాహన కూడా కలిగి ఉండాలని, ఎకో టూరిజం అభివృద్ధి ప్రాంతాల్లో సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. హోటల్స్ నిర్వాహకులు, ట్రావెల్స్ నిర్వాహకులు ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడే వారికి కఠినంగా వ్యవహరించాల్సిన ఆదేశాలను తెలిపారు.
ప్రకృతి సంపదను వారసత్వ సంపదగా గుర్తించాలనేది ఉప ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, కొండపల్లి, మంగళగిరి, సిద్ధవటం వంటి ప్రాంతాలలో అడ్వెంచర్ టూరిజం, పర్వతారోహణ, నదీ జలాల్లో బోటు రేసులు వంటి కార్యకలాపాలను ప్రోత్సహించాలని ఆయన అన్నారు. పర్యాటక ప్రాంతాల ఆర్కిటెక్చర్ ద్వారా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల ప్రదర్శన కచ్చితంగా ఉండాలని, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను పరిరక్షించాలని సూచించారు.









