పక్కా రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వలస వచ్చి ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాజుర కోనత్‌పూర్ గ్రామానికి చెందిన గౌరవ్ తులసీరాం నికోడే (యువకుడు) బుధవారం భావన నిర్మాణ పనుల కోసం వాంకిడి మండలానికి వచ్చారు.
గోయగాం గ్రామానికి చెందిన మాడావి వాసుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటికి స్లాబ్ పనులు చేపడుతుండగా, సమీపంలోని విద్యుత్ తీగలకు ఇనుప పైపు తగలడంతో గౌరవ్ తులసీరామ్‌కు తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది. సంఘటన చోటు చేసుకున్న వెంటనే స్థానికులు అతన్ని వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసిఫాబాద్‌కు రెఫర్ చేశారు. అయితే ఆసిఫాబాద్ ఆసుపత్రికి చేరేలోపే గౌరవ్ తులసీరాం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సకాలంలో వైద్యం అందకపోవడమే మృతికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు.
వాంకిడి ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లినప్పటికీ గంటకు పైగా ఎవరూ పట్టించుకోలేదని, డాక్టర్లు అందుబాటులో లేరని బాధితులు వాపోయారు. తక్షణ వైద్యం అందించి ఉంటే గౌరవ్ ప్రాణాలు నిలిచేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన వైద్య సేవలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.









