పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేపై బుధవారం రాత్రి ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. టీజీ 11 ఏ 9177 నంబర్ గల కారు నుంచి కొందరు ఆకతాయిలు టపాకాయలు పేలుస్తూ, రాకెట్ ఫైర్ చేస్తూ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. వేగంగా కదులుతున్న కారులో నుంచే ఇలా చేయడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు, రాకెట్ ఫైర్ చేస్తున్న యువకులు ఉన్న కారును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్గా మారడంతో విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారేలా ప్రవర్తించిన ఈ ఘటనపై పోలీసులు సీరియస్గా స్పందించారు.
వీడియోలో కనిపించిన కారు నంబర్ ఆధారంగా పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. కారు యజమానిని గుర్తించి ప్రశ్నించగా, కారు తమదేనని యజమాని ఒప్పుకున్నాడు. ఆ కారు నడుపుతూ రాకెట్ ఫైర్ చేసిన యువకులను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ చేసిన యువకులను అనంతరం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హైవేలపై ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తన ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.









