రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సబ్‌మెరైన్‌ ప్రయాణం

President Droupadi Murmu will embark on a submarine voyage from Karwar Harbor on Dec 28, inspecting the capabilities of the tri-services.

దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము డిసెంబర్‌ 28న కర్ణాటకలోని కర్వార్‌ హార్బర్‌ నుంచి సబ్‌మెరైన్‌లో సముద్ర ప్రయాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌ అధికారులు శుక్రవారం అధికారికంగా ఈ పర్యటనను ప్రకటించారు. ఈ సముద్ర ప్రయాణం త్రివిధ దళాల సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించే దిశగా జరుగుతుంది.

రాష్ట్రపతి ముర్ము గోవా, ఝార్ఖండ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు పర్యటనున్నారు. సాయుధ దళాల సామర్థ్యాన్ని, నౌకాదళ కార్యకలాపాలను తన త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ హోదాలో సమీక్షించనున్నారు. సబ్‌మెరైన్‌ ప్రయాణం ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఇటీవలే రాష్ట్రపతి ముర్ము సాహసోపేత ప్రయాణాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. రెండు నెలల క్రితం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్‌ యుద్ధ విమానంలో గగనవిహారం చేశారు. అంతకు ముందు 2023 మే 8న అస్సాంలోని తేజ్‌పుర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి సుఖోయ్‌-30 యుద్ధ విమానంలో ప్రయాణించి ఘనత సాధించిన రెండో మహిళా రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు.

2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, 2006లో మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి. జె. అబ్దుల్‌ కలాం సుఖోయ్‌-30 యుద్ధ విమానాల్లో ప్రయాణించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ముర్ము తాజా సబ్‌మెరైన్‌ ప్రయాణం నౌకాదళ శక్తిని పరిశీలించడంలో ఒక కీలక ఘట్టంగా, త్రివిధ దళాల సామర్థ్యాన్ని దేశానికి చాటిచెప్పే అవకాశం అని అధికారులు పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share