గత నెలలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. ఈ ఘటన ఉగ్రదాడిగా నిర్ధారణ కావడంతో, దాడి వెనుక డాక్టర్ల హస్తం ఉన్నట్టు వెల్లడైన తర్వాత దేశం మొత్తం ఉలిక్కిపడింది. సుమారు 40 కిలోల పేలుడు పదార్థాలను ఈ దాడిలో ఉపయోగించారని పోలీసులు గుర్తించారు.
తాజాగా ఈ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించిన యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్ 2025లో వ్యాఖ్యానించారు. జమ్మూ-కశ్మీర్ పోలీసులు ఈ కేసు దర్యాప్తును అద్భుతంగా నిర్వహించినట్లు, పేలుడు జరగకముందే మూడు టన్నుల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని, నిందితులను ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు హోంమంత్రి తెలిపారు.
అమిత్ షా దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు కొత్త ప్రణాళికను ప్రవేశపెడతామని, అత్యంత ముఖ్యమైన ఏటీఎస్ విధానాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వీలైనంత త్వరగా అమలు చేయాలని డీజీపీలకు సూచించారు.
కేంద్ర సంస్థలు, రాష్ట్ర పోలీసులు ఈ సాంకేతికతను వివిధ స్థాయిల్లో సమర్థవంతంగా వినియోగిస్తున్నారని కూడా అమిత్ షా వెల్లడించారు. భవిష్యత్తులో ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉగ్రవాదంపై మరింత కఠిన చర్యలు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.








