గజ్వేల్ పట్టణంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన నలుగురు నిందితులను గజ్వేల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో గజ్వేల్ ట్రాఫిక్ ఎస్‌ఐ నిరేష్ సిబ్బందితో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తూప్రాన్ వై జంక్షన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఈ సమయంలో రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన పిట్ల నర్సింలు, సిద్ధాల రాజు, అదే మండలం వీరానగర్‌కు చెందిన గట్ల మైపాల్, మిరుదొడ్డికి చెందిన అంకిరెడ్డిపల్లి రాంసాగర్ పంచాయతీ సెక్రటరీ పయ్యావుల గణేష్ అనే నలుగురు అక్కడికి చేరుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించే అధికారం మీకు ఎక్కడిది అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పోలీసు విధులకు ఆటంకం కలిగించారు.
ఈ ఘటనపై గజ్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయగా, గజ్వేల్ ఎస్‌ఐ ప్రేమ్ దీప్ నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా గజ్వేల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, పోలీసు విధులకు ఆటంకం కలిగించినా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల రక్షణ కోసమే విధులు నిర్వహిస్తారని, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.









