రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని ఆమె స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నేషనల్ హైవే అథారిటీ, ఆర్ అండ్ బి, రవాణా, ఆర్టీసీ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్యారోగ్యం, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించి, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, ప్రమాదాలకు గల కారణాలపై చర్చించారు.
బ్లాక్ స్పాట్లలో తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ప్రమాదాన్ని లోతుగా పరిశీలించాలని సూచించారు. జనవరి 1 నుంచి నిర్వహించనున్న జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను ప్రణాళికాబద్ధంగా విజయవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాను ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యంగా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2023 నుంచి 2025 మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రులు, మరణాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వివరాలను వెల్లడించారు. 2026 నాటికి ప్రమాదాలను పూర్తిగా తగ్గించేందుకు అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, మున్సిపల్, ట్రాఫిక్, ఆర్టీసీ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.









