నూతన సంవత్సర శుభాకాంక్షలతో గిఫ్ట్‌లు, భారీ ఆఫర్ల పేరుతో వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న లింకుల పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ ఇయర్-ఎండ్ ఆఫర్లు, ఉచిత గిఫ్ట్‌లు, ట్రావెల్ డిస్కౌంట్లు, ఈవెంట్ టిక్కెట్ల పేరుతో సైబర్ మోసగాళ్లు మోసపూరిత లింకులను పంపిస్తున్నారని తెలిపారు.
ఈ లింకులను క్లిక్ చేస్తే ఫోన్‌లో తెలియకుండానే ప్రమాదకరమైన APK ఫైల్ ఇన్‌స్టాల్ అవుతుందని, వ్యక్తిగత డేటా చోరబడే అవకాశముందని హెచ్చరించారు.
అందువల్ల, మెసేజింగ్ యాప్‌ల ద్వారా వచ్చే APK ఫైల్స్‌ను ఎప్పుడూ ఇన్‌స్టాల్ చేయరాదు. కేవలం అఫీషియల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లోనుంచి మాత్రమే యాప్‌లు డౌన్లోడ్ చేయాలని, OTPలు, PIN, CVV వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోరాదు అని సూచించారు.
వాట్సాప్‌లో ‘టూ-స్టెప్ వెరిఫికేషన్’ ఫీచర్‌ను ఎన్‌బుల్ చేసుకోవాలని, పొరపాటున ఏదైనా మోసపు లింక్ క్లిక్ చేసినట్లయితే వెంటనే ఇంటర్నెట్ ఆఫ్ చేసి అనుమానాస్పద యాప్‌లను డిలీట్ చేయాలని సూచించారు. అలాగే, బ్యాంకుకు సమాచారమిస్తూ ఖాతాలను సురక్షితం చేయాలి. సైబర్ మోసానికి గురైతే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.









