ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ బట్టల బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు.
వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సమిష్టిగా అభివృద్ధి సాధించాలని స్వామివారిని మంత్రి ప్రార్థించారు. సకల జనులకు శుభం కలగాలని, శాంతి సమృద్ధులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
దైవారాధన మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆధ్యాత్మిక భావనతో జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని, భక్తి మార్గం మనిషిని సరైన దిశగా నడిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేయగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది.









